- ఈ నెల 9 వరకు తొలి విడత నగదు చెల్లింపునకు చాన్స్
- గడువులోగా కట్టకపోతే ఫ్లాట్ అలాట్‌మెంట్ రద్దు: వీపీ గౌతమ్
హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన లబ్ధిదారులకు హౌసింగ్ బోర్డు అధికారులు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్లను పంపించారు. ఈ కేటాయింపులకు సంబంధించి తొలి విడత రూ. లక్ష చెల్లించే గడువును ఈ నెల 9 వరకు పొడిగించారు.
ఈనెల 4 వరకు 16 నియోజకవర్గాల్లో మొత్తం 5,501 ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్లు జారీ చేయగా, అందులో 3,271 మంది లబ్ధిదారులు రూ. లక్ష చొప్పున చెల్లింపులు పూర్తి చేశారని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు.
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈనెల 9లోగా తొలి విడత నగదు చెల్లించకపోతే ఫ్లాట్ అలాట్‌మెంట్ రద్దు చేస్తామనన్నారు. మిగిలిన సుమారు 35 వేల మంది అర్హులైన దరఖాస్తుదారులకు కూడా తదుపరి డ్రా ఆఫ్ లాట్స్‌లో అందుబాటులో ఉండే ఫ్లాట్లను కేటాయిస్తామని వెల్లడించారు.
